గురువారం

సాగే స్రవంతి..


పార్క్లో ఫ్లెడ్ లైట్లకి, అలవాటు పడిపోయాను ఇప్పుడు ప్రతీ రేయీ పగలే వెన్నెల ఒక గతం.
దాని అవసరమూ లేదు
నేను నడుస్తున్నాను-
నా ముందు నా నీడ.

ఎదురుగా ఒక తాత
అడుగులో అడుగేసుకుంటూ,
బాధ్యతలు తీరినా
ఆ భుజాలు ఇంకా ఏదో బరువు మోస్తున్నట్టు
ఇంతటి వెలుగులోనూ అతని కళ్ళు మెరవడం లేదు మా చూపులు కలిసాయి..
నీళ్ళు లేని బావిలా నా చూపుని చీకట్లో కలిపేస్తున్నట్టు
ఆతని కళ్ళు నన్ను లోతెంతో తెలియని ఏవో ప్రశ్నలు సంధిస్తున్నట్లున్నాయి.. మా చూపులు విడిపోయాయి...
ఈ వెలుగులో పురుగులు కూడా పెరిగాయి.
చిందర వందరగ గాల్లో నాకు అడ్డంపడుతున్నాయి
వీటికీ అలవాటు పడుతున్నాను.
ఇంతకీ ఆ ప్రశ్నలు - నాకా?
నా తరానికా?

నేను నడుస్తూనే ఉన్నాను...
ఈ ఫ్లెడ్ లైట్లకి అలవాటు పడిపోయాను వెన్నెల ఒక గతం.
దాని అవసరమూ లేదు..

కానీ కరెంట్ పోతేనో?!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి