నిరాశలో ఎన్ని వేడి నిట్టూర్పులు విడిచానో.. నా ఈ గది నాలుగు గోడలకే తెలుసు.. నీధ్యాసలో ఎన్ని రుధిరాశ్రువులు రాల్చానో.. నా ఈ తలపులు పంచుకొనే తలగడకే తెలుసు..
నీశ్వాసలో మునిగి ఎన్ని పరివేదనలు దాచుకున్నానో.. నా ఈ స్మృతి యవనికలకే తెలుసు.. నీఆశలో తేలి ఎన్ని విరహవేదనలు మిగుల్చుకున్నానో.. నా ఈ గతి పవనికలకే తెలుసు..
నీకోసం విరించినై ఎన్ని ప్రేమలేఖలు రాసానో.. వలపులు నింపుకొనే నా అక్షరాలకే తెలుసు.. నీకోసం విపంచినై ఎన్ని రాగాలు పలికించానో.. తలపులు వొంపుకొనే నా మది గవాక్షాలకే తెలుసు..
ఇవన్నీ నీకై నే రాసే వలపు కావ్యాలు.. ఇవన్నీ నీకై నే దాచే తలపు దృశ్యాలు..
ఊహల ప్రయాణం ఊపిరి వున్నంత వరకే.. ఊసుల నిరీక్షణం ఊహలున్నంత వరకే..
ఎన్ని చూపులు?? ఎన్ని మాటలు?? కాలం కరిగిపోతుంది, స్వప్నం ఇక చాలు అని కంటిపాప చెబుతుందా? మది మీటుతున్న భావసరిగమల్ని ఆపమని ఎద చెబుతుందా?
ఎన్ని కలలు?? ఎన్ని అలలు?? సరాగాల అంచులకు.. సుస్వరాల మాలికల్ని చేర్చకు అని రాగమాలిక చెబుతుందా?? హారాల రాగ ప్రభంధాలకు.. మనోహరాల ఆల్లికలని పేర్చకు అని హాలిక చెబుతుందా??
ఎన్ని సరదాలు?? ఎన్ని జ్ఞాపకాలు?? రెప్పల మాటున తన రూపుని దాచకు అని నయనానికి కంటిపాప అడ్డొస్తుందా?? ఊహల చాటున తనని బంధించకు అని మదిలోని రూపు మాసిపోమ్మంటుందా??
ఎన్ని ఊహలు?? ఎన్ని నిట్టూర్పులు?? పెదవి మాటున దాగిన మౌనాన్ని చేధించమని నిశ్శబ్దం అడుగుతుందా?? నాసిక మరవని శ్వాసని తనపైని ఆశ మరచిపోమ్మని కోరుతుందా??