
మరచిపోయావా?
నువ్వు నేను కలిసి పంచుకొన్న ఊహలు..
మనస్సూ మనస్సూ కలిపి విరచించుకొన్న ఊసులు..
వాడిపోయాయా?
నాకై నువు రువ్విన ఓరచూపుల కంటికొనల ధృక్కులు..
నాకై నువు రాల్చిన మంత్ర ముగ్ధపు మనోహర వాక్కులు..
చెరిగిపోయాయా?
నువ్వు నేను మెలిసి నడిచిన దారిలో విరిసిన పాదముద్రలు..
నువ్వు నేను రాసి మది అంతరంగపు పుటల్లో దాచుకున్న కవితలు..
కరిగిపోయాయా?
నీకై నేను పంపిన వలపు మేఘసందేశాల ఆనందవీచికలు..
నీకై నేను వొంపిన తలపు తనూ వైభవపు విరీచికలు..
తరిగిపోయాయా?
చేయి చేయి కలిపి వెన్నెల రాత్రుల్లో మనం ఆలపించిన మంజీరనాదాలు..
ధ్యాస శ్వాస కలగలిపి పున్నమి కాంతుల్లో మనం తిలకించిన సాగరకెరటాలు..
మరచిపోయావా?
మన్ను మిన్ను కలిసినట్లున్నా అవి ఎప్పటికీ కలవవన్న నిజం..
కన్ను కన్ను పక్కనే ఉన్నా అవి ఎప్పటికీ చూసుకోలేవన్న నిజం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి