శనివారం

గౌతమీ తీరాన


గౌతమీ తీరాన,
ఏకాంత సమయాన..
విరహ వేదనతో నేను,
వీచే గాలుల్లా,
సాగే ప్రవాహంలా..
తేలే ఊహల్లో నేను,
గూటికి చేరే పక్షులు,
విహరించే చేపలు,

నా ఒంటరితనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే...
చెలి రాదే అని,
చెంత చేరదే అని..?

వెన్నెల్లో వెచ్చదనాన్ని వెతుక్కుంటున్నాను...
చంద్రుల్లో చెలి ముఖారవిందాన్ని చూసుకుంటున్నాను...
చుక్కల్లో తన చూపుల్ని అన్వేషిస్తున్నాను...

కిన్నెరసాని పాపి కొండల్ని పోటెక్కించినట్టు,

తలచే తలపుల,
కలచే కలవరింతల స్రవంతి
నా గుండెల్ని...!

నాలోనే ఉన్నావు...


నీ తలపుల తారలెన్నో నా హృదయాకాశం లో...
నా ఆశల కిరణాలెన్నో
నీకై చూసే చూపుల దారులలొ...
రగిలే జ్వాలలెన్నో
నీ ఊహల విరహంలో...
నిన్ను నాకు దగ్గర చేసిన దూరాన్ని అడుగు...
నీ కలలతో పగలు రేయి ఒకటైపోయిన కాలాన్ని అడుగు...
భాధ కూడా తియ్యగా ఉంటుందని తెలిపే ఈ దూరాన్ని, కాలాన్ని ఈక్షణాన స్తంభించిపోని... నీ కలలతో,
తలపులతో,
విరహంతో
ఈ క్షణం నిలిచిపోని... కానీ ఎంత వరకు?
చెలీ ఎంత వరకు...?
నీ రాకకై...

శుక్రవారం

విరహం


ఇప్పుడే కురిసిన వాన జల్లు పరిసరాలని పులకరింప చేసింది
చెలి కలయికని తెలిపే ఊహలు నా మనసుకి కలిగించే పులకరింత లాగా...
వాన జల్లుకు తడిసన మట్టి వాసన గమ్మత్తుగ ఉంది చెలి చేరువలో వెళ్తున్నప్పుడు గాలి వాసన కలిగించే మత్తులాగా...
చల్ల గాలులు, కారు మబ్బులు
లేని వెచ్చదనాన్ని, రాని వెన్నెలని గుర్తు చేస్తున్నాయి...
చెలి దూరంగా వుంది
తన కలవరింత ప్రకృతి ఆస్వాదనని దూరం చేస్తుంది...
చెలీ రావే,వరాలీవే,
వెతికా నిన్ను వీచే గాలుల్లో కన్నా నిన్ను కారు మబ్బుల్లో... వెచ్చదనం ఏదని?
వెన్నెల రాదే అని?
చెలీ రావే,వరాలీవే...

మీకు తెలుసా


మీకు తెలుసా
వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు,
వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు,
పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు,
ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా?
ప్రకృతి ఏకాంతవాసి అని?
ఏకాంతంలొ సృష్టి జరుగుతుందని...

గురువారం

సాగే స్రవంతి..


పార్క్లో ఫ్లెడ్ లైట్లకి, అలవాటు పడిపోయాను ఇప్పుడు ప్రతీ రేయీ పగలే వెన్నెల ఒక గతం.
దాని అవసరమూ లేదు
నేను నడుస్తున్నాను-
నా ముందు నా నీడ.

ఎదురుగా ఒక తాత
అడుగులో అడుగేసుకుంటూ,
బాధ్యతలు తీరినా
ఆ భుజాలు ఇంకా ఏదో బరువు మోస్తున్నట్టు
ఇంతటి వెలుగులోనూ అతని కళ్ళు మెరవడం లేదు మా చూపులు కలిసాయి..
నీళ్ళు లేని బావిలా నా చూపుని చీకట్లో కలిపేస్తున్నట్టు
ఆతని కళ్ళు నన్ను లోతెంతో తెలియని ఏవో ప్రశ్నలు సంధిస్తున్నట్లున్నాయి.. మా చూపులు విడిపోయాయి...
ఈ వెలుగులో పురుగులు కూడా పెరిగాయి.
చిందర వందరగ గాల్లో నాకు అడ్డంపడుతున్నాయి
వీటికీ అలవాటు పడుతున్నాను.
ఇంతకీ ఆ ప్రశ్నలు - నాకా?
నా తరానికా?

నేను నడుస్తూనే ఉన్నాను...
ఈ ఫ్లెడ్ లైట్లకి అలవాటు పడిపోయాను వెన్నెల ఒక గతం.
దాని అవసరమూ లేదు..

కానీ కరెంట్ పోతేనో?!